గుజరాత్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.
రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
అగ్నిమాపక దళ అధికారి హెచ్‌సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.
వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్‌ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.