విద్యార్థులను భుజాన ఎక్కించుకుని వరద ప్రవాహాన్ని దాటించిన మాస్టారు

ఉపాధ్యాయుడంటే కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలను బోధించటమే కాదు.. విద్యార్థులకు మంచి చెడుల వ్యత్యాసాన్ని నేర్పించి.. మంచి మార్గాన్ని చూపించటం కూడా. అవసరమైతే.. చేయి పట్టుకుని ఆ మార్గం వెంట నడిపించి గమ్యం చేరేలా చేయటం కూడా గురువు బాధ్యతే. అచ్చంగా అదే పని చేశాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను తమతమ జీవితాల్లో గమ్యాలను చేర్పించటం ప్రస్తుత కాలంతో కొంచెం కష్టమైన విషయమే కానీ.. అడ్డుగా నిలిచిన వరద ప్రవాహాన్ని సురక్షితంగా దాటించి గమ్యస్థానాలకు చేర్చి.. మా మంచి మాస్టారు అనిపించుకున్నాడు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచికల్‌పేట్‌ గ్రామంలోని జైహింద్‌పూర్‌లో ఉన్న పాఠశాలకు గురువారం (జులై 25న) ఉదయం 26 మంది చిన్నారులు చిన్న వాగును దాటి పాఠశాలకు వచ్చారు. అయితే.. ఆ ప్రాంతంలో కురిసిన వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో.. సాయంత్రం సమయానికి వాగులో ప్రవాహం భారీగా పెరిగింది. పాఠశాల ముగిసిన తర్వాత.. పిల్లలు తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఆ వాగులోని వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డారు. ఈ విషయాన్ని తమ ఉపాధ్యాయుడు సంతోష్‌కు తెలపగా.. విద్యార్థులను ఎలాగోలా వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చాలని నిర్ణయించుకున్నాడు.

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సంతోష్‌.. విద్యార్థులను తన భూజాలపై ఎక్కించుకుని.. నడుం లోతు వస్తున్న వరద ప్రవాహాన్ని జాగ్రత్తగా దాటుకుని.. ఒడ్డుకు చేర్చటం ప్రారంభించాడు. ఇలా.. ఒక్కొక్కరుగా 10 మంది విద్యార్థులను సురక్షితంగా వరద దాటించాడు. ఉపాధ్యాయునికి గ్రామస్థులు కూడా సహకరించి.. మిగతా పిల్లలను ఒడ్డు దాటించి.. పిల్లలను సురక్షింతంగా ఇంటికి చేర్చారు.

ఉపాధ్యాయుడు చేసిన ఈ పనిని కొందరు వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పెట్టగా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. పీకల దాకా తాగి.. ఒంటిపై సోయి లేకుండా పాఠశాలలకు వస్తున్న సార్ల కంటే.. ఈ మాస్టారు వెయ్యి రెట్లు బెటర్ అంటూ కొనియాడుతున్నారు. వచ్చామా.. పాఠాలు చెప్పామా.. టైం కాగానే వెళ్లిపోయామా అనే ఉపాధ్యాయులున్న ప్రస్తుత కాలంలో.. పిల్లలను భుజాలపైన ఎక్కించుకుని వరద ప్రవాహం దాటించి సురక్షింత ఇండ్లకు చేర్చటంమనేది చాలా గొప్ప విషయమని మెచ్చుకుంటున్నారు.

About amaravatinews

Check Also

తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!

సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *