PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) లాంచ్ చేసింది. ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక నంబర్ కేటాయిస్తుంటుంది. పీఎఫ్ ఖాతాలన్నీ ఈ యూఏఎన్ నంబర్ కింద ఉంటాయి. సెప్టెంబర్, 2024కు సంబందించిన అధికారిక పేరోల్ గణాంకాలను ఇటీవలే విడుదల చేసింది ఈపీఎఫ్ఓ. దాని ప్రకారం చూస్తే సెప్టెంబర్ నెలలో 18.81 లక్షల మంది పీఎఫ్ ఖాతాదారులు పెరిగారు. ప్రతి సభ్యునికి ఒకే శాశ్వత యూఏఎన్ నంబర్ కేటాయిస్తారు. ఇది అతని ఉద్యోగ జీవిత కాలంలో ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుంది.
అయితే ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ యూఏఎన్ లేని వారికి ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ వెబ్‌సైట్ ప్రకారం.. ‘ ప్రియమైన కంపెనీ యాజమాన్యాలకు, ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలు పొందేందుకు ఉద్యోగులు యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలి. దయచేసి మీ ఉద్యోగులందరికీ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసేలా చేయండి’ అని ఈపీఎఫ్ఓ కంపెనీ యాజమాన్యాలకు సూచించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నవంబర్ 12, 2024 రోజున విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కంపెనీలు తమ సంస్థలో చేరిన ఉద్యోగులందరికీ నవంబర్ 30, 2024లోపు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ చేయించాలి. కొత్తగా చేరిన వారితో ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. తమ సంస్థలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక రెండో దశలో ఫేస్ రికగ్నిజన్ టెక్నాలజీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించాలి. అంటే ఉద్యోగులు తప్పకుండా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సేవలు ఆన్‌లైన్ ద్వారా అందుతాయి.