ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకు అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షిండే వ్యాఖ్యానించారు. ఇటీవల తన ఆలోచనను పవన్ కళ్యాణ్‌తో పంచుకుంటానని ఓ టీవీ కార్యక్రమంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చిన షాయాజీ షిండే పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి సమావేశానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ కార్యాలయం ఎక్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసింది. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలంటూ నటుడు షాయాజీ షిండే చేసిన సూచనను స్వాగతిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో ఈనెల 14 నుంచి ప్రారంభించే పల్లె పండగ వారోత్సవాల్లో రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండగ వారోత్సవాల నిర్వహణపై కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,239 కోట్ల విలువైన 26,715 పనులకు కలెక్టర్లు ఇప్పటికే అనుమతులు ఇచ్చారన్నారు.. మిగిలిన పనులకు కూడా త్వరగా అనుమతులివ్వాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది రూ.4,500 కోట్ల పనులకు పంచాయతీలు తీర్మానాలు చేశాయన్నారు పవన్. కలెక్టర్లు ఆమోదించిన పనులు వారోత్సవాల్లో ప్రారంభించాలి అన్నారు.