Adani Group: రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను కొట్టిపారేసింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. అక్కడి చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని స్పష్టం చేసింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది.
సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏకంగా రూ.2100 కోట్లు భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ విషయంలో గౌతమ్ అదానీ సహా మరో 7 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వార్తలు వెలుగులోకి వచ్చిన క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. ఒక్కరోజులోనే లక్షల కోట్లు నష్టం వచ్చింది. రాజకీయంగానూ దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.