దక్షిణాఫ్రికాకు అఫ్ఘానిస్థాన్ షాక్.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం

ప్రపంచ క్రికెట్‌లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు అనామక జట్టుగా ఉన్న అఫ్ఘాన్.. ఇటీవల కాలంలో హేమాహేమీ జట్లను సైతం ఓడిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆ దేశ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. దక్షిణాఫ్రికా జట్టును మాత్రం షాక్‌కు గురి చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన అప్ఘానిస్థాన్.. రెండో వన్డేలో ఏకంగా 177 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే తమ భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, రియాజ్ హసన్‌ను శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ఆ తర్వాత రియాజ్ ఔట్ అయినా.. గుర్బాజ్ మాత్రం జోరు కొనసాగించాడు. 22 ఏళ్ల గుర్బాజ్.. వన్డేల్లో తన ఏడో సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన అఫ్ఘానిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. గుర్బాజ్‌ (105)కు తోడు అజ్మతుల్లా (50 బంతుల్లో 86 రన్స్ నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో అఫ్ఘానిస్థాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆచితూచీ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు టెంబా బవూమా (38), టోనీ డి జార్జీ (31) రాణించడంతో ఓ దశలో 73/0తో నిలిచింది. ఆ తర్వాత ఇద్దరి వికెట్లూ కల్పోయి 98/2తో నిలిచింది. ఈ దశలో అఫ్ఘానిస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ముఖ్యంగా బర్త్ డే బాయ్ రషీద్ ఖాన్.. తన స్పిన్‌తో ప్రొటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. కేవలం 26 పరుగుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికా చివరి 8 వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడిపోయింది. రషీద్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తాచాటగా.. కరోటే 4 వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ పడగొట్టాడు.

ఈ విజయంతో అఫ్ఘానిస్థాన్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో తమ భారీ విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. ఈ మ్యాచులో అఫ్ఘాన్.. 177 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు ఈ రికార్డు 154 పరుగులుగా ఉండేది. 2018లో జింబాబ్వేతో మ్యాచ్‌లో అది జరిగింది. ఇక రెండో వన్డేలో విజయంతో అఫ్ఘానిస్థాన్ తొలిసారి దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచింది. నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం షార్జా వేదికగా జరగనుంది.

About amaravatinews

Check Also

కపిల్‌దేవ్, చంద్రబాబు భేటీ.. ఏపీలో ఆ మూడు చోట్లా గోల్ఫ్ కోర్టులు!

Cricketer Kapil dev meets cm Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *