ముడా భూముల (MUDA Scam) వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి (BN Parvathi) కీలక ప్రకటన చేశారు. తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని సీఎం సతీమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ముడాకు లేఖ రాశారు. ముడా కుంభకోణంపై లోకాయుక్త, ఈడీ కేసులతో సతమతమవుతోన్న సిద్ధరామయ్యకు ఆమె నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
‘నా భర్త సీఎం సిద్ధరామయ్య 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదు.. విలువలను పాటించి.. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తపడ్డారు.. ఆయన రాజకీయ, ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగరాదనే నేను ఇంటికే పరిమతమయ్యాను.. ఏనాడూ బయటకు రాలేదు.. ఆయనకు దక్కుతున్న ప్రజాదరణ చూసి సంతోషపడినా.. ముడా స్థలాల విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.. మా సోదరుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఈ స్థలాలు ఇంత రాద్దాంతం చేస్తాయని ఊహించలేదు.. నా భర్త గౌరవం, ఘనతకు మించి ఈ ఆస్తులు పెద్దవి కాదు.
ఇన్నేళ్లు ఆయన అధికారం నుంచి ఏమీ ఆశించని మాకు ఈ ఆస్తులు తృణప్రాయం.. ఈ దశలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కొందరు అడగొచ్చు.. కానీ, ఆరోపణలు వచ్చిన రోజే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ముడా ప్లాట్ల కేటాయింపుపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి.. కొంతమంది శ్రేయోభిలాషులు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని, వారి కుట్రలకు బలికావద్దని సూచించారు. అందుకే ప్లాట్లు తిరిగి ఇచ్చే విషయంలో మొదట్లో వెనక్కి తగ్గాను.. ఇప్పడు మాత్రం అందుకే ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగిస్తున్నా.
ఈ విషయంలో నా భర్త అభిప్రాయం ఏమిటో తెలియదు.. నా కుటుంబ సభ్యులతోనూ చర్చించకుండా నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమిది.. ఈ ఆరోపణలు వినిపించిన రోజే ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. నా భర్త రాజకీయ కుట్రలో మరింత నష్టపోతున్నాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నా. అవసరమైతే దర్యాప్తునకు సహకరిస్తా.. రాజకీయాలకు దూరంగా ఉండే నాలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దు అని అన్ని పార్టీల నాయకులు.. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను…
కాగా, ముడా వ్యవహారంలో కేసు నమోదుచేసిన లోకాయుక్త.. సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి, దేవరాజులతో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. దేవరాజు నుంచి భూమిని కొనుగోలుచేసిన మల్లికార్జున స్వామి.. తన సోదరి పార్వతికి పసుపు కుంకుమగా ఇచ్చారు.