తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అందరినీ టెన్షన్ పెట్టింది. 141 మంది ప్రయాణికులతో తిరుచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలెట్లు గుర్తించారు. దీంతో వెంటనే తిరుచ్చి ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో అందరిలోనూ ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమైంది. ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్ ల్యాండింగ్ అవుతుందా కాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో మరింత భయాందోళనలు పెరిగాయి. అయితే ఎయిరిండియా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు పైలెట్లు తీవ్రంగా ప్రయత్నించారు.
ఏటీసీ సలహాల సాయంతో ఎయిరిండియా విమానాన్ని సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో విమానం సేఫ్ ల్యాండింగ్ కావాలంటే.. విమానంలో ఉన్న ఇంధనాన్ని ఓ స్థాయికి తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం పైలెట్లు ఎయిర్ పోర్డు వద్ద ఎయిరిండియా విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. సుమారు రెండున్నర గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.