ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి విజయవాడ నగరం గజగజా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో అక్కడికి పడవల్లోనే అధికారులు వెళ్లి.. బాధితులకు భోజనం, తాగునీరు అందిస్తున్నారు. మరీ వరదలో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారు ఇళ్లల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరద నీటిలోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
గత 3, 4 రోజులుగా కురుస్తున్న వానలకు విజయవాడ నగరం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. చాలా ప్రాంతాల్లో వరద నీటిలోనే మునిగిపోయాయి. ఈ క్రమంలోనే అజిత్ సింగ్ నగర్ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయింది. అజిత్ సింగ్ నగర్‌లోని డాబాకొట్టు సెంటర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని కుటుంబ సభ్యులు.. దిక్కు తోచని స్థితిలో విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆలోపే ఆ మహిళ ప్రసవించింది.
అయితే వరద ప్రాంతంలోనే గర్భిణీ ప్రసవించిన విషయం తెలుసుకున్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. తల్లీ, బిడ్డ ఇద్దరినీ బోటులో అజిత్ సింగ్ నగర్ నుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లీబిడ్డను పరీక్షించిన డాక్టర్లు.. వారిద్దరూ క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బాలింతను, అప్పుడే పుట్టిన పసికందును.. వరదల నుంచి సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన పోలీసులు, రెస్క్యూ సిబ్బందిని స్థానికులు ప్రశంసించారు.
ఇక విజయవాడ నగరంలో వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు బాధితులకు ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్‌ను అందిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద సంభవించిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు నాయుడు.. కాన్వాయ్ మధ్యలోనే ఆగిపోవడంతో కాలినడకనే వరదలో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పర్యటన తర్వాత సీఎం తాత్కాలిక సచివాలయ ఆఫీస్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal