‘బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. వాళ్లు చెబితేనే చేశా’ భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్

నంద్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. నంద్యాల విజయ డెయిరీకి వెళ్లిన ఆమె.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుతో ఉన్న శిలాఫలకాన్నే కాలువలో పడేయడంపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిరీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నంద్యాలలో పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడు తొలగించి కాలువపై వేయడంపై మండిపడ్డారు.

విజయ డెయిరీలో తొలగించి కాలువలో పడేసిన శిలాఫలకానికి పాలతో అభిషేకం చేశారు. డెయిరీ ఎండీ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ఉండటాన్ని గమనించి సీరియస్‌గా స్పందించారు. వెంటనే ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలు ఉండాలని చెప్పారు. కానీ దీనికి విరుద్ధంగా మాజీ సీఎంలు జగన్, రాజశేఖర్‌రెడ్డితో పాటు గంగుల వాళ్ల ఫొటోలు ఎలా పెడతారని ప్రశ్నించారు. వెంటనే ఆ కార్యాలయంలో ఫొటోలను తొలగించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోను ఏర్పాటు చేశారు.

డెయిరీలో సీసీ కెమెరాలు లేవు, శిలాఫలకాన్ని ఎవరు పగులగొట్టారో అడిగితే జవాబు లేదని మండిపడ్డారు అఖిలప్రియ. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అఖిలప్రియ విజయ డెయిరీ ఛైర్మన్‌ కార్యాలయంలో ఆయన కుర్చీలో కూర్చొని ఉండగా ఛైర్మన్‌ ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు ఫోన్‌ చేయగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన కుర్చీలో ఎలా కూర్చుంటారని అఖిలప్రియను జగన్‌మోహన్ ప్రశ్నించారు. డెయిరీ సిబ్బంది కూర్చోమంటే కూర్చున్నానని చెప్పారు. తనను అడగకుండా ఆ కుర్చీలో కూర్చోడానికి నువ్వెవరంటూ మండిపడ్డారు. ‘గతంలో మా కుర్చీలో మీరు కూర్చోలేదా’ అంటూ అఖిలప్రియ ప్రశ్నించారు. ‘బెదిరిస్తున్నావా.. నన్ను కుర్చీలో నుంచి కదపండి చూద్దాం’ అన్నారు అఖిల. ‘నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావా.. నా ఇంటికి రా.. ఎలా వస్తున్నావో చెప్పు.. మామగా వస్తే మర్యాదిస్తా’ అంటూ అఖిలప్రియ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. దీంతో నంద్యాల జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *