మన్యం ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే సమస్యలు.. ఒకటి మావోయిస్టులు.. రెండు గంజాయి. ఇక విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా సహా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయిని అక్రమంగా సాగు చేస్తుంటారు. పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు, అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం గంజాయి మహమ్మారిని అరికట్టడానికి కీలక చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గంజాయి సాగు నుంచి మన్యం ప్రాంతాల వాసులను మళ్లించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా అవకాడో వైపు వారిని మళ్లిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు గంజాయి సాగును అరికట్టేందుకు ప్రయోగాత్మకంగా ఈ అవకాడో సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం స్థానికులకు అవకాడో విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత ఆరు ఎకరాల్లో అవకాడో సాగును చేపట్టనున్నారు. మెక్సికో, మధ్య అమెరికా ప్రాంతంలో అవకాడోను సాగు చేస్తుంటారు. కువైట్ నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక అవకాడో మొక్కలు 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కు ఉష్ణోగ్రతల వద్ద పెరుగుతుంది. సాధారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇందుకు అనువుగా ఉంటాయి. అందుకే ఆస్ట్రేలియా నుంచి అవకాడో రకాన్ని దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు.
ఒక ఎకరం విస్తీర్ణంలో అవకాడోను సాగు చేస్తే దాదాపు 500 నుంచి 600 క్వింటాళ్లు పండించవచ్చు. దీని ద్వారా పండించే రైతుకు రూ.4 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిని.. ఇందుకు ఎంచుకున్నారు. వీరితో ఈ ప్రత్యా్మ్నాయ పంటలు సాగుచేయించాలనేదే అధికారుల ఆలోచన. స్థానిక వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఉద్యానవన శాఖ అధికారులు అవకాడోతో పాటుగా ఇతరత్రా ప్రత్యా్మ్నాయ పంటలను కూడా సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా జీడి, సీతాఫలం, జామ, కొబ్బరి, చింతపండు, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ ఇలా 20 రకాల పంటలను సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే అనంతగిరి, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తున్నారు.