భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది వణికిపోతోంది. ఢిల్లీ, హిమాచల్, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఉత్తరాదిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై మహా నగరాల్లో ఎడతెరిపి లేని వానలతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైను భారీ వర్షాలు ముంచెత్తడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుణెలో విద్యుత్‌షాక్‌తో నలుగురు మృతి చెందారు.
ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నడుము లోతు నీళ్లు రావడంతో జనం నరకయాతన పడుతున్నారు. చాలాచోట్ల సబ్‌వేల్లోకి నీళ్లు చేరాయి. గుజరాత్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. పోర్‌బందర్, సూరత్, జునాఘడ్ , వడోదర జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గుజరాత్‌లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది.
దేశ రాజధాని ఢిల్లీని కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఢిల్లీలోని సీపీ ఔటర్ సర్కిల్, మోతీబాగ్, రింగ్ రోడ్ ప్రాంతాల్లో.. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలవడంతో..ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ కులూ జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో మనాలీ-లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఉత్తరాదిన భారీ వర్షాలతో జనజీవితం స్తంభించింది.
Amaravati News Navyandhra First Digital News Portal