ఆ మూడు పదాలు తొలగింపు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చేసిన సూచనలను అనుసరించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చట్టం – 1986కు సవరణను చేసింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ ఆమోదించగా.. హెల్త్‌ వర్సిటీ చట్టం నుంచి ‘కుష్ఠు, చెవిటి, మూగ’ పదాలు తొలగించింది. వర్సిటీ బోర్డులో కుష్ఠు రోగులు, చెవిటి, మూగ సమస్యలు కలిగిన వారు సభ్యులుగా చేరేందుకు అర్హులు కాదని విశ్వవిద్యాలయం చట్టంలో పేర్కొన్నారు. అయితే వీరిపై వివక్ష చూపరాదంటూ ఎన్‌హెచ్‌ఆర్సీ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు చేసింది.

ఆ సూచనల మేరకు చట్ట సవరణలను ప్రతిపాదిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అసెంబ్లీలో తెలిపారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ చట్టానికి సవరణ కోరుతూ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఆమోదం లభించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఆయుర్వేదిక్‌ అండ్‌ హోమియోపతి మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టంకు సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. వాటికి సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ కో – ఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

అసెంబ్లీలో మొత్తం 7 బిల్లులకు ఆమోదం తెలిపారు. పైన తెలిపిన బిల్లులతో పాటుా.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ సవరణ బిల్లు-2024, ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేస్తూ చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిరోధక బిల్లు-2024కు శాసనసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆప‌రేటివ్ సోసైట్ స‌వ‌ర‌ణ బిల్లు-2024నూ శాసనసభ ఆమోదం తెలియజేసింది.

రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.. ఏపీ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని.. పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అభ్యసించాలనే కల నెరవేరుస్తామన్నారు. మంగళగిరిలో 30 పడకల వైద్యశాలను వంద పడకలుగా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేశారన్నారు. దీనికి అవసరమైన సౌకర్యాలు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

About amaravatinews

Check Also

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *