ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో వాడీవేడి చర్చ జరిగింది.. కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతలు, వారి ఇళ్లలో మహిళలపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరు ప్రస్తావను వచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కొందరు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంతమంది పోలీసుల తీరు మారలేదని.. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారం పనిచేయమన్నా.. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ పోస్టులు చూసి వారు కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఇంట్లోంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయాను అన్నారు. మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులపైనా అసభ్యంగా పోస్టులు పెట్టారని ప్రస్తావించారు. ఇటీవల కొన్ని ఘటనల్లో మహిళలు, బాలికలపై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారమైనా పోలీసులు సత్వరం స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు.