ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2న మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడింది.. ఆగస్టు 7న సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళతారు.. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వరుస పర్యటనల కారణంగానే కేబినెట్ భేటీని వాయిదా వేశారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని కోరారు.
ఆగస్టు 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.. పలు కీలక పథకాల అమలుకు ఆమోదం తెలపనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్ల పట్టాలు, కొత్త ఎక్సైజ్ పాలసీ, వాలంటీర్ల కొనసాగింపు వంటి కీలకమైన అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఆగస్టు 7న జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంపై అందరి దృష్టి ఉంది.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గనులశాఖ, ఎక్సైజ్‌శాఖలపై సమీక్ష చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ వ్యవహారం.. ఆ శాఖలో ప్రక్షాళనపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. ఇటు ఎక్సైజ్ శాఖపైనా చంద్రబాబు రివ్యూ చేస్తారు.. అయితే మద్యం కొత్త విధానంపైనా చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు.. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుండటంతో.. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేయాలని భావిస్తున్నారు. అలాగే లిక్కర్ బాటిల్స్‌కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించబోతున్నారు. పాత మద్యం విధానంలో ఉన్న లోపాలను సరి చేసి.. ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా..? వద్దా అనే అంశంపై క్లారిటీ ఇవ్వనున్నారు.