ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. జూన్ 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఢతలు తెలుపనున్నారు. కాగా, చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వసారి విజయం సాధించడం విశేషం. ఆనాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు.. 1989 నుంచి ఇక్కడ్నుంచి వరుసగా విజయాలు నమోదు చేస్తున్నారు. బీజేపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు విందు బీజేపీ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు తన నివాసంలో గురువారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు సీఎం నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.