ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో.. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 2029 నాటికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గృహనిర్మాణంపై సమీక్ష చేసిన చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పురోగతిపై వివరించారు. డిసెంబరులో పీఎంఏవై 2.0 పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించేలా కేంద్ర గృహనిర్మాణశాఖతో త్వరితగతిన ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులకు సంబంధించి చర్చ జరిగింది. వారికి రూ.35 వేలు బ్యాంకుల నుంచి రుణంగా అందించగా.. దాన్ని రూ.లక్ష వరకు పెంచి వడ్డీ లేని రుణంగా అందించే విషయంపై చర్చించారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర పథకాలైన జలజీవన్ మిషన్, అమృత్ వంటివాటిని వినియోగించుకుని ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్తు, రహదారుల సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అంతేకాదు 597 మందిని డిప్యుటేషన్ ద్వారా గృహ నిర్మాణ శాఖలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు 75 వేల ఇళ్లను పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. మరో 7.6 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయని.. డిసెంబర్ 12 నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లోనే విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళాలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల నాణ్యతను తనిఖీ చేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇప్పటికే విశాఖలోని ఓ లేఅవుట్‌లోని నిర్మాణాల నాణ్యతను పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్ ద్వారా తనిఖీ చేయగా.. ఆ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ లేఅవుట్లలో ఈ విధానంలో తనిఖీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.