ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో నీరు చేరి భారీగా వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో పలు జిల్లాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. దీంతో అక్కడ నివసించే జనజీవనం అస్తవ్యస్తం అయింది. పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలను సహాయక శిబిరాలకు తరలించింది. ఈ క్రమంలోనే వరద ప్రభావానికి గురై.. ఇళ్లు, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చూపించారు.
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల ప్రజలు వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. మొత్తం 4317 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని.. 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు ముంపుకు గురయ్యాయని వెల్లడించారు. ఇక మొక్కజొన్న, పత్తి లాంటి మిగితా పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని చెప్పారు.