అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలో బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు.. భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.
మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.. వారికి ధైర్యం చెప్పారు.
అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు చంద్రబాబు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా.. 35మందికిపైగా గాయాలయ్యాయని.. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారన్నారు. ఆస్పత్రుల్లో ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తామని.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు.. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal