ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 4 (శుక్రవారం) నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని.. వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు.. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బులు జమ కాలేదు.
ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.588.59 కోట్లు జమ చేసిందన్నారు చంద్రబాబు. ఇప్పటికే 97% మంది అకౌంట్‌లలోకి డబ్బులు చేరాయని.. అకౌంట్ వాడకంలో లేకపోవడం, మరికొందరి అకౌంట్‌లకు ఆధార్ లింక్ కాకపోవడం, కొన్ని అకౌంట్‌లు క్లోజ్ కావడం, మరికొందరు అకౌంట్ నంబర్ తప్పుగా నమోదు చేయడం, కొందరి వివరాలు సరిగా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో 22,185మందికి డబ్బులు సాయం జమ కాలేదన్నారు. అందుకే అకౌంట్‌లలో డబ్బులు జమకాని వారు బ్యాంకకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని సూచించామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు చంద్రబాబు.