కర్నూలు జిల్లా ప్రజలకు ఊరట.. ఆ పనులు వెంటనే ఆపాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌‌లో యురేనియం తవ్వకాలకు బ్రేక్ పడింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపేయాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. యురేనియం లభ్యత, పరిశోధనల కోసం బోర్లు వేసే ప్రతిపాదనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు తెలిపారు. ఇకపై అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవు అన్నారు.

యురేనియం తవ్వకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. యురేనియం తవ్వకాలకు సంబంధించి ప్రస్తావించారు.. వెంటనే స్పందించిన సీఎం.. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని చెప్పారు. అయితే ఎంఏడీ కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్‌-2 అనుమతులు ఇవ్వాల్సి ఉంది.. ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో తవ్వకాలకు బ్రేక్‌ పడింది. కప్పట్రాళ్ల ప్రాంతంలో బోర్‌హోల్స్‌ వేయడం నిలిచిపోనుంది.. కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా కూడా అధికారికంగా ప్రకటించారు. యురేనియం తవ్వకాలు జరగవని.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.

యురేనియం తవ్వకాలు కూటమి ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోయినా.. కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు తవ్వకాలకు చంద్రబాబు సర్కార్ అనుమతులు ఇచ్చిందంటూ దుష్ప్రచారం చేశారని మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి యురేనియం అంశంపై స్పష్టత తీసుకున్నామని.. వైఎస్సార్‌సీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనే యురేనియం డ్రిల్లింగ్‌, తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో.. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమీప గ్రామాల ప్రజలకు ఉపశమనం దక్కింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, బండపల్లి, బంటుపల్లి, కోటకొండ, బేతపల్లి, ఈదుల దేవరబండ, నెల్లిబండ, దుప్పనగుర్తి, జిల్లేడుబుడకల, చెల్లెల చెలిమెల గ్రామాల ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. యురేనియం వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడ్డారు.. వీరికి పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *