ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు.

ఆలయాల్లో ప్రసాదం, అన్నదానం నాణ్యంగా ఉండాలని.. ఒకవేళ ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రధాన ఆలయాల్లో ఎంతమంది భక్తులు తింటే, అందరికీ అన్న ప్రసాదాలు అందించాలని సూచించారు. తొలుత 61 ప్రధాన, ముఖ్య ఆలయాల్లో అన్ని సేవల్ని ఆన్‌లైన్‌లో, నగదు రహితంగా అందించాలని.. ఆ తర్వాత మిగిలిన ఆలయాలకు వర్తింపజేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,110 ఆలయాలకు కొత్త పాలకవర్గాలను నియమించాలని.. అలాగే ఇకపై ప్రతి పాలకవర్గంలో ఇద్దరు సభ్యులను పెంచాలని సేచించారు. దీని కోసం అవసరమైన చట్టసవరణకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే పాలకవర్గ సభ్యుల్లో ఓ నాయీబ్రాహ్మణుడికి అవకాశం ఉండగా.. కొత్తగా ఓ బ్రాహ్మణుడికి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలను బలోపేతం చేయాలని సూచించారు చంద్రబాబు. వీటికి కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు కసరత్తు చేయాలని చెప్పారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజున దేవాదాయశాఖ అధికారిక కార్యక్రమం నిర్వహించాలని సూచన చేశారు. రాష్ట్రంలో రూ.50వేలలోపు వార్షికాదాయం ఉన్న 5,470 ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌ (ధూప, దీప, నైవేద్యపథకం) కింద ఇప్పుడిస్తున్న రూ.5వేల సాయాన్ని రూ.10వేలకు పెంచాలన్నారు. సీజీఎఫ్, శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో చేపట్టిన ఆలయాల పనులు వేగంగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు.

గత ప్రభుత్వం సీజీఎఫ్‌ (కామన్‌ గుడ్‌ ఫండ్‌), శ్రీవాణి ట్రస్టు నిధులతో కొన్ని పనులు ప్రతిపాదించింది. వీటిలో కొన్ని పనులు ప్రారంభంకాగా.. మరికొన్ని ప్రారంభం కాలేదు. ఇప్పటికే మొదలైన పనులను పూర్తిచేయాలని.. అసలు ప్రారంభంకాని పనులను నిలిపివేసి మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కలిపి భక్తులు కానుకలుగా ఇచ్చిన వెండి 44,194 కేజీలు ఉందని.. ఈ వెండిని ఆయా ఆలయ స్వామి, అమ్మవార్ల చిత్రాలతో డాలర్లుగా భక్తులకు విక్రయించడంపై ఆలోచన చేయాలని సూచించారు. వేద పాఠశాలల్లో సంస్కృత మంత్రోచ్చరణతో పాటుగా దాని అర్థం కూడా చెప్పేలా వేద శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇలా చేస్తే భక్తులకు అర్థం అవుతుందన్నారు. ఎప్పటి నుంచో ఉన్న సింహాచలం పంచగ్రామాల భూసమస్య శాశ్వత పరిష్కారంపై అధికారులు అధ్యయనం చేయాలన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లోని నాయీ బ్రాహ్మణులకు కనీసవేతనం రూ.25వేలు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మత మార్పిడులు జరగకూడాదని.. ఈ మేరకు అవసరమైన చర్యలతో అడ్డుకోవాలన్నారు. అలాగే ఆలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *