ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకురానుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్‌కు సమీపంలో ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు వీలు కల్పించి, లారీలు ఇసుక నిల్వకేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చేవరకు నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఇసుక సరఫరాపై అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని.. ఆ వేబిల్లు ఉన్న లారీలనే స్టాక్ పాయింట్లలోకి అనుమతించాలని సూచించారు. వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఇసుక నిల్వ కేంద్రంలో రోజుకు ఎన్ని లారీలు లోడ్ చేసేందుకు అవకాశం ఉందో.. అంత వరకే వినియోగదారులకు బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకు మంచి ఎక్కువమంది వస్తే, మరుసటి రోజు లోడింగ్ చేసేలా వేబిల్లు జారీ చేస్తారు.
ఇసుకకు సంబంధించిన వేబిల్లుపై వినియోగదారుడి పేరు, మొబైల్ నంబరు, లోడింగ్‌కు వచ్చే వాహనం నంబరు ఉంటాయి. వేబిల్లులో ఉండే తేదీ, సమయం ప్రకారమే లారీలను స్టాక్ పాయింట్ల వద్దకు అనుమతిస్తారు. వేబిల్లులు లేని వాహనాలు స్టాక్‌పాయింట్ల వద్దకు రాకుండా పోలీసులు నియంత్రిస్తారు. ఇసుక ధర ఎంతో కలెక్టర్లు ప్రకటించిన తర్వాత అంతకు మించి ఎక్కువ డబ్బులు, వెయిటింగ్ ఛార్జీ అంటూ అధిక ధరలు ఎవరు వసూలు చేస్తే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకుంటారు. ఇసుక బుకింగ్, లోడింగ్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నంబరు 1800-599-4599కు కాల్ చేయొచ్చు.. అలాగే ఇసుక తీసుకెళ్లిన వినియోగదారులకు కాల్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు.
ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు స్టాక్ పాయింట్లవారీగా ఇసుక బుకింగ్, లోడింగ్, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే dmgapsandcomplaints@yahoo.comకు మెయిల్ చేయాలని సూచించారు. ఇసుక సరఫరాకు సంబంధించి ఐవీఆర్ఎస్ విధానంతో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఉచిత ఇసుకకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు మరింతగా ఫోకస్ పెట్టారు. ఇసుక విషయంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా.. ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.