ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు వచ్చింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయాల్లో ఉద్యోగులు, వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని.. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామితోపాటు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు.

రాష్ట్రంలో ఆర్థికంగా అత్యంత వెనకబడి ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. శాఖ పనితీరు, పథకాల అమలుపై చర్చించారు. విద్య, ఉపాధి అవకాశాల ద్వారా దళిళ వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీ రుణాల అందజేయడంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. 2014-19 మధ్య అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ‌ ఓవర్సీస్‌ విద్యానిధి, బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్స్, సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ కోసం ఎన్టీఆర్‌ విద్యోన్నతి, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాలు అమలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి జరిగిందని.. ఆ తర్వాత ఈ పథకాలను రద్దు చేడయంతో నష్టం జరిగిందన్నారు. ఆయా పథకాల కారణంగా దళిత కుటుంబాలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనంపై ప్రణాళికను సిద్ధం చేసుకు రావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మరోవైపు గిరిజనులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సేవల్ని తిరిగి అందుబటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.. గిరిజన సంక్షేమశాఖపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన పాఠశాలల్లో ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ ఏఎన్‌ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 543 గిరిజన పాఠశాలలు, ప్రీ, పోస్టుమెట్రిక్‌ వసతి గృహాల్లో ఏఎన్‌ఎం సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్‌ఎంలను డిప్యుటేషన్‌పై ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలి అన్నారు. ఇకపై ఎక్కడా గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని.. అవసరమైన ప్రతి చోటా చోట్లా ఫీడర్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మరింత సాంకేతికతతో వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌)ల్లో నైపుణ్య శిక్షణ అందించాలన్నారు చంద్రబాబు. గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీ ఉత్పత్తి, సరఫరాపై ఆరా తీశారు. టీ టైం తరహాలో అరకు కాఫీని ఊరూరా ప్రమోట్‌ చేయాలని.. దీనికి అవసరమైన సమగ్ర ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. లంబసింగిలోని మ్యూజియంను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గంజాయి ఎక్కడా కనిపించకూడదని.. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏ సంస్థల కార్యకలాపాల వేగం పెరగాలి అన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *