ఏపీ ఉచిత గ్యాస్ సిలండర్ల పథకం.. తొలిరోజు ఎంతమంది బుక్ చేసుకున్నారంటే, అంత తక్కువా!

ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మొదలైంది. ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ దీపం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సూపర్‌ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకమని గుర్తు చేశారు. తొలిరోజు 4.3 లక్షల బుకింగ్‌లు అయ్యాయని.. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. గ్యాస్ రోజుకు రెండున్నర లక్షల బుకింగ్‌లకు డెలివరీ చేయగలమని చెప్పాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.55 కోట్ల లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు మంత్రి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ఒకవేళ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించి ఏదైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబరు 1967 అందుబాటులో ఉందన్నారు. అలాగే ఈ దీపం పథకానికి అవసరమైన నిధుల్ని విడుదల చేశారు. అమరావతిలోని సచివాలయంలో మహిళా లబ్ధిదారుల చేతుల మీదుగా హిందూస్థాన్, భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులకు సంబంధిత చెక్కును అందించారు. ఈ పథకం కింద నాలుగు నెలలకో సిలిండర్‌ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. ఈ పథకానికి రాయితీ రూపంలో ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ ధర గరిష్ఠంగా రూ.876 ఉంది.. దీనిలో కేంద్రం రూ.25 వరకు రాయితీ ఇస్తోంది. మిగిలిన రూ.851ను సిలిండర్‌ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇందర సంస్థల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం అమలు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపం 2.0 పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతిమంతం చేస్తున్నామన్నారు. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ దీపావళి రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయల్దేరి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖపట్నంకు విమానంలో వెళతారు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఈదుపురం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు గ్యాస్‌ ఆటోలకు పచ్చజెండా ఊపి, లబ్ధిదారులకు సిలిండర్లు అందజేస్తారు. అలాగే అక్కడ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పింఛను అందజేస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని.. రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేస్తారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *