ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల దీపం పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS (మెసేజ్) వెళుతుందని చెప్పారు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందని.. సిలిండర్ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా.. ఈ నెల 29న ఆయిల్ కంపెనీలకు చెక్కు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని మంత్రి ప్రకటించారు. ఒకవేళ లబ్ధిదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో అర్హత ఉంటే చాలు.. వీలైనంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.47 కోట్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని.. అందరూ సిలిండర్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారన్నారు మంత్రి మనోహర్.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. దీపావళి నుంచి ఆ పథకాన్ని అమలు చేస్తోంది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. ఈ పథకానికి ఏడాదికి రూ.2,684 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.876 కాగా.. అందులో రూ.25 రాయితీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తున్నారు. అయితే ఈ మిగిలిన రూ.851 లబ్ధిదారుల అకౌంట్‌లో ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది.
అయితే సిలిండర్ ధరను లబ్ధిదారులు డెలివరీ సమయంలో చెల్లిస్తే.. వాటిని 48 గంటల్లో డబ్బులు తిరిగి వారి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగు నెలలకు ఓ సిలిండర్ చొప్పున ఉచితంగా అందిస్తారు. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి జులై నెలాఖరు వరకు మొదటి సిలిండర్.. ఆగస్టు 1 నుంచి నవంబరు నెలాఖరు వరకు రెండవ సిలిండర్.. డిసెంబరు 1 నుంచి 2026 మార్చి నెలాఖరు వరకు మూడో సిలిండర్ అందజేస్తారు. ఈ మేరకు దీపం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.