తిరుమల పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అయితే మార్గ మధ్యలో ఆయన వెన్నునొప్పి కారణంగా ఇబ్బందిపడ్డారు. అయితే బుధవారం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించారు. అనంతరం తిరుమలోని అతిథి గృహంలో బస చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ ఉంది.. జ్వరం ఉన్నా సరే పవన్ సభకు హాజరవుతానని చెప్పినట్లు జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు..11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం తన కుమార్తెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనాతో శ్రీవారి ఆలయ మహద్వారం దగ్గరకు వెళ్లగా.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కిన పవన్ కళ్యాణ్.. బంగారు వాకిలి నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి పంచబేరాలు, శ్రీవారి మూలవిరాట్టు విశిష్టతను డిప్యూటీ సీఎంకు వివరించారు. శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్‌కు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలను అందజేశారు.
పవన్ కళ్యాణ్ దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చి నేరుగా శ్ రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు.. అక్కడ అన్నప్రసాదం తయారీ విధానాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం నేరుగా అతిథిగృహానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ బుక్‌పైనే ఉంది. డిప్యూటీ సీఎం ఆ పుస్తకానికి ఆలయంలోకి తీసుకెళ్లడంతో అందరూ చర్చించుకున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావుఫులే విగ్రహం దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి సభను నిర్వహిస్తున్నారు. ఇందులో వారాహి డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సభ కావడంతో అందరిలో ఆసక్తిరపుతోంది.. వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉంటాయనే ఉత్కంఠ ఉంది. ఈ సభలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.