ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఇంజనీరింగ్‌ మొదటి సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరడంతో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈఏపీసెట్‌ 2025 ఇంజనీరింగ్‌లో 1,89,748 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది మొత్తం 1.81 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రాగా.. ఈసారి 2 లక్షలకుపైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలు పెరగడమే అందుకు కారణం. అయితే సీట్ల వివరాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేయనుంది.

తాజా షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు చేపట్టనుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 10 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. మొదట ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టిన తర్వాత ఫార్మసీ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేయనున్నారు. వ్యవసాయ కోర్సులకు ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మరోవైపు ఇంజనీరింగ్‌ ఫీజులను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే ఫీజులు ఖరారు చేశారు. ఈ ఏడాది కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.

జులై 9 నుంచి ఏపీ ఈసెట్‌ కౌన్సెలింగ్‌

పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఇంజినీరింగ్‌ విద్యార్ధులు బీటెక్‌ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందగోరే విద్యార్థులకు ఏపీ ఈసెట్‌ 2025 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరికి మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై 9 నుంచి 22 వరకు, రెండో విడత కౌన్సెలింగ్‌ జులై 30 నుంచి ఆగస్టు 4 వరకు కొనసాగుతుంది. జులై 24 నుంచి వీరికి తరగతులు ప్రారంభంకానున్నాయి.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *