ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రంగాలకు అతీతంగా వీఐపీలు, వీవీఐపీలు తమకు తోచిన రీతిలో బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, విశ్వక్ సేన్ వంటి హీరోలతో పాటుగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. అశ్వనీదత్ వంటి నిర్మాతలు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి విరాళాలు కూడా అందించారు. అయితే తాజాగా ఏపీలోని వరద బాధితుల కోసం భారీ విరాళం అందింది. ఏకంగా రూ.120 కోట్లు విరాళమిచ్చేందుకు ఉద్యోగులు ముందుకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. తమ నెల జీతంలో ఒకరోజు బేసిక్ పేను వరద బాధితుల కోసం విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా వచ్చే రూ.120 కోట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెల్లడించారు. ఇక ఈ విరాళంలో పెన్షనర్లు కూడా భాగమైనట్లు పేర్కొన్నారు. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన జేఏసీ నేతలు శివారెడ్డి, విద్యాసాగర్ విరాళం తాలూకు అంగీకార పత్రాన్ని ఆయనకు అందించారు. మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు కలిసి ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం రూ.120 కోట్లు ఉండొచ్చని అంచనా.
మరోవైపు ఏపీలోని వరద బాధితుల కోసం విరాళం ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక పరిషత్ కూడా ముందుకు వచ్చింది. ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు తెలిపారు. ఈ విషయమై మిగతా సంఘాలతో ఏపీపీటీడీ ఎండీ మాట్లాడాలని ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చేందుకు ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్ అధ్యక్షుడు సూరపనేని శేషగిరిరావు అనుమతి కోరారు. ఆర్టీసీ సంఘాలు కూడా విరాళం ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు కోరుతున్నారు. మొత్తంగా సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు పలు చేతులు ముందుకు వస్తున్నాయి.