ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం (ఆరోగ్య శ్రీని) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఓ లెటర్ కూడా వైరల్ అవుతోంది.. కొంతమంది దీనిని ట్వీట్, పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని తొలగిస్తున్నట్టు షేర్ చేస్తున్న జీవో ఫేక్. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం’ చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారంపై ఎప్పటికప్పుడుస్పందిస్తోంది. గతంలో కూడా ఎన్నో అంశాలపై క్లారిటీ ఇచ్చింది.
గత వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరును ఎన్టీఆర్ వైద్య సేవ పథకంగా మార్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బకాయిల అంశం ఇటీవల తెరపైకి వచ్చింది.. ఆ బకాయిల్ని చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి.. లేకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి తెలిపాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నెటవర్క్ ఆస్పత్రులకు సంబంధించిన కొన్ని బకాయిల్ని చెల్లించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపానదలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కొన్ని అవాంతరాలు ఎదురుకావడంతో.. ఈ పథకాన్ని ట్రస్టు ద్వారా కాకుండా బీమా విధానంలో అమలు చేయాలని ఆలోచన చేశారు. బీమా విధానంలో హెల్త్ కార్డులు కలిగిన వారు దేశవ్యాప్తంగా ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఒకవేళ ఇదే బీమా విధానం కనుక రాష్ట్రంలో అమల్లోకి వస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.