టీటీడీలోకి మరో కీలక అధికారి వచ్చారు.. అదనపు ఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి కాగా.. డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిది. దీంతో ఈ నెల 16న కేంద్రం ఆమోదం తెలపగా.. ఆయన ఈ నెల 22న ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన్ను టీటీడీ అదనపు ఈవోగా నియమించడంతో పాటు తిరుమల జేఈవోగానూ విధులు నిర్వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకయ్య చౌదరి శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి ఆగష్టు 7వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఆగష్టు 7న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స లోని గీతామందిరం, ఆర్‌ఎస్ మాడ వీధి లోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు.