ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెన్షన్లు జమ చేసింది. ఆగస్టు 1నే జీతాలు జమ చేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.. ఓ ఉద్యోగి వీడియోను ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు.. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్ధ పాలనకు నిదర్శనం’ అన్నారు. ఒకటో తేదీన జీతాలు పడ్డాయంటూ ఓ ఉద్యోగి పలకపై రాశారు.. గురువారం ఉదయం 7.45 నిమిషాలకు జీతం అకౌంట్‌లో పడిందని చెప్పారు.
గత రెండు నెలల నుంచి జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీనే జమవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు కొత్త డీఏతో కలిపి పెన్షన్ రావడం శుభపరిణామం అని పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలోనూ ఒకటో తేదీనే జీతాలు జమ చేశారు. ఆగస్టు నెలలో కూడా అదే జరిగింది.. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరికీ విడతలవారీగా జీతాలు జమ చేశారు.