ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత టీడీపీ హయాంలో పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. 2014-2019 మధ్య పండగులకు కానుకలు అందించారు.. ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్రాతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలను రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా చంద్రన్న కానుకలు అందిస్తారు. ఈ పథకానికి ఏడాదికి రూ.538 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.2,690 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది.
చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్‌లో.. కిలో గోధుమ పిండి, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరకిలో కందిపప్పు, అరలీటరు పామాయిల్, 100 మిల్లీ గ్రాముల నెయ్యిని కార్డుదారులకు అందించారు. అలాగే క్రిస్మిస్ కానుక కింది వీటినే అందించారు. రంజాన్ తోఫా కింద ముస్లింలకు 5 కిలోల గోధుమపిండి, కిలో వర్మిసెల్లి, 2 కిలోల చక్కెర, 100 మిల్లీగ్రాముల నెయ్యితో తోఫా కిట్లను ఉచితంగా అందజేశారు. 2019 జూన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్‌కార్డు దారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందజేయనున్నారు.