ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1,500 అందించడంపై మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రవ్యాప్తంగా ఫేక్ సంఘాలను సృష్టించి కొంతమంది రుణాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ముందు ఇదే తరహాలో రూ.7 కోట్ల మేర అవినీతి జరిగిందని.. ఇలాంటివి రాష్ట్రంలో మరెక్కడైనా ఉన్నాయా? అనే దానిపై జిల్లాల వారీగా విచారణ చేయబోతున్నామన్నారు. కొత్తగా ఫేక్ సంఘాలు ఏర్పాటు కాకుండా డిజిటల్ ఐడీ రూపొందించాలని నిర్ణయించామన్నారు మంత్రి.
మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. పది జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీనివాస్. ఈ ప్రత్యేక నిధితో డ్వాక్రా సంఘాలతో సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎకరం వరకు స్థలాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించార్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ మహిళల ఉపాధి కల్పనకు మండల కేంద్రాల్లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)లో డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్. ఇప్పటికే దేవి, త్రిపుర ఫుడ్స్ అమ్మకాలను ప్రారంభించామని..ఇదే తరహాలో వెయ్యి ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాది ఎన్‌ఎల్‌ఆర్‌ఎమ్ పథకానికి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.41 కోట్లను గత ప్రభుత్వం ఇవ్వనందున రూ.512 కోట్లను కేంద్రం విడుదల చేయలేదన్నారు. ఈ మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 మండలాల్లో స్త్రీశక్తి భవనాల నిర్మాణం.. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 21 డైరెక్టర్, పీడీ పోస్టులను పునరుద్ధరించేందుకు కూడా అంగీకారం తెలిపారన్నారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్త్రీనిధి నుంచి రూ.950 కోట్లను వేర్వేరు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొచ్చి మళ్లించారన్నారు. అలాగే డ్వాక్రా మహిళలు పింఛను కోసం పొదుపు చేసుకున్న రూ.2,100 కోట్లను కూడా ఇతర వాటికి మళ్లించారన్నరు మంత్రి శ్రీనివాస్.