ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచనలు చేశారు. చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. చంద్రబాబు వర్ష ప్రభావిత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష చేశారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
మరోవైపు గోదావరి పరీవాహక, ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు, వరదలతో రోడ్లు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి, కాకినాడ, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో వరి, వివిధ పంటలు మునిగాయి. భారీ వర్షాలతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. విశాఖపట్నం ఆదర్శనగర్‌లోనూ కొండచరియలు విరిగిపడ్డాయి.
కోనసీమ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు మునిగాయి.. కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా తొమ్మిది మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.