ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. సింధు ఆసియా, కామన్వెల్త్ క్రీడలతోపాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం ఆమెకు ఓడీ (ఆన్ డ్యూటీ) సదుపాయాన్ని కల్పించారు. ఆమెకు వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ సింధు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని ఆరోసారి పొడిగించారు.
పీవీ సింధు 2016 ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించారు.. దీంతో ఏపీ ప్రభుత్వం సింధును ఘనంగా సన్మానించింది. ఆమెకు ఇంటి స్థలం, నగదు నజరానా, అలాగే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది. ఆమెకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియామక పత్రాన్ని అందజేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా అవకాశం ఇవ్వడంపై సింధు ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో విధుల్లో కూడా చేరారు. సింధు డిప్యూటీ కలెక్టర్ విధులు, బాధ్యతలపై శిక్షణ కూడా తీసుకున్నారు. సింధు హైదరాబాద్‌లో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వమే కాదు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఘనంగా సన్మానించి.. ఆమెకు హైదరాబాద్‌లో స్థలంతో పాటుగా నగదు నజరానా కూడా అందించిన సంగతి తెలిసిందే.