ఏపీలో వారందరికి రూ.25వేలు, రూ.10వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీని వర్షాలు, వరదలు వణికించాయి.. విజయవాడతో పాటూ మరికొన్ని జిల్లాలపై ప్రభావం కనిపించింది. ప్రధానంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.. ఇళ్లన్నీ నీటమునిగాయి. ఇలా వర్షాలు, వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు ఊరటనిచ్చే దిశగా ఏపీప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఈ ప్యాకేజీని అందజేసే దిశగా అడుగులు వేస్తోంది.

విజయవాడలో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25 వేలు.. అలాగే ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు రూ. 10 వేల చొప్పున సాయం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వరదల్లో నీటమునిగిన ఆటోలకు, ట్యాక్సీలకు రూ. 10 వేలు.. అలాగే మోటర్‌ సైకిళ్ల మరమ్మతుకు రూ.3 వేలు ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు.. గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ ప్యాకేజీ, పరిహారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై మంత్రుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆర్థిక సాయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. వరద బాధితులతో పాటుగా రైతుల్ని కూడా ఆదుకోవాలని.. ఆ దిశగా వారికి ప్యాకేజీ, పరిహారం అందజేయాలని ఆలోచన చేస్తున్నారట. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని.. వీలైనంత త్వరగా వారికి సాయం అందజేయాలని భావిస్తున్నారట.విజయవాడలోని పలు కాలనీల్లో వరద తగ్గిపోగా.. ఇళ్లలో బురద మాత్రం ఉంది. ఓవైపు ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. వరద నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీసి మెకానిక్ షాపుల దగ్గరకు తీసుకెళుతున్నారు.. ఎక్కడా చూసినా రిపేర్ కోసం తీసుకొచ్చిన బైక్‌లే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మెకానిక్‌లు ఇంటింటికి వెళ్లి ఇళ్లలోని వస్తువులు, వాహనాలను రిపేర్లు చేస్తున్నారు.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులతో ఆమె నేరుగా మాట్లాడారు.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని.. తక్షణసాయం కింద రూ.15వేలు అందించాలని షర్మిల డిమాండ్ చేశారు. బుడమేరు వరదపై టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య బురద రాజకీయం జరుగుతోందని.. ఈ వరదలకు చంద్రబాబు, జగన్ కారణం అన్నారు . చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టులను జగన్‌ సీఎం అయ్యాక రద్దు చేశారో చెప్పాలన్నారు. వరదలతో రూ.6,800 కోట్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని.. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాలేదన్నారు. విజయవాడ డివిజన్‌ నుంచి ఏటా రూ.6వేల కోట్ల ఆదాయం రైల్వేకు వస్తుందని.. కానీ కేంద్రం నుంచి గుక్కెడు నీరు కూడా ఏపీకి ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లల నుంచి విరాళాలు సేకరించడం కాదు.. కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురావాలన్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *