ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టింది. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే రైతులకు సంబంధించిన ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని వచ్చే మార్చి, ఏప్రిల్‌లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో కూటమి తల్లికి వందనంపై హామీ ఇచ్చింది. చదువుకునే పిల్లలందరికీ.. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. వీరందరికీ తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు దాదాపు రూ.12వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం ఆలస్యం కావడానికి కారణాలు ఉన్నాయట.. ఈ పథకానికి సంబంధించి పక్కాగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారట. అందుకే కొంత సమయం తీసుకున్నా అన్ని లోపాలను సరిచేసి అమలు చేయబోతున్నారట.
Amaravati News Navyandhra First Digital News Portal