ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల హామీల అమలుపైనా ఫోకస్ పెట్టారు. తాజాగా మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ మేరుకు దరఖాస్తుల్ని కూడా ఆహ్వానిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చే పనిలో ఉంది. అయితే ఇక్కడ మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది.. అది కూడా వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు ఈ పథకాన్ని ముందుగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దరఖాస్తుల్ని ఆహ్వానించింది దేవాదాయశాఖ. వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులు ఈ భృతిని పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని దేవదాయ శాఖ అధికారులు జిల్లాల్లో సూచించారు.
నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం నెలకు రూ.3,000 ఇవ్వనుందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నవాళ్లు.. వేదవిద్య ధ్రువపత్రంతో పాటుగా ఆధార్‌కార్డు, ఏ ఉద్యోగమూ చేయడం లేదని స్వీయ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ పత్రాలతో కూడిన దరఖాస్తును తీసుకుని ఈనెల 26వ తేదీలోగా ఆయా జిల్లాల్లోని దేవాదాయశాఖ కార్యాలయానికి రావాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు అధికారులు. క్రమాంతం ఆపై కోర్సులు చదివిన వేద విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ప్రకటించాయి. ఈ పథకం ప్రస్తుతం వేద విద్య చదివిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. మిగిలిన వారికి పథకం అమలుపై క్లారిటీ రావాల్సి ఉంది. నిరుద్యోగ భృతి అమలుపై కనీసం విధి విధానాలు, మార్గదర్శకాల జారీపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.