ఏపీలో వరద పరిహారం ఇంకా అందనివారికి బిగ్ రిలీఫ్.. వివిధ కారణాల వలన వరద పరిహారం అందని వారికి సోమవారం పరిహారం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వరదల కారణంగా సుమారు నాలుగు లక్షల మంది ప్రభావితులయ్యారనే అంచనాతో ప్రభుత్వం వరద పరిహారం విడుదల చేసింది. మొత్తం రూ.602 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే చాలా మందికి వారి బ్యాంకు ఖాతాల్లో పరిహారం మొత్తం జమైంది. అర్హులైన వారిలో ఇప్పటి వరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా రెండు శాతం మందికి కూడా వివిధ కారణాలతో పరిహారం అందలేదని.. వారికి సోమవారం అందిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు వరద బాధితులకు పరిహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రూ.602 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో రూ.18.69 కోట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది. బ్యాంకు ఖాతాల అనుసంధానం సహా ఇతరత్రా సాంకేతిక కారణాలతో రెండు శాతం మంది.. అంటే 21,768 మంది బాధితులకు పరిహారం సొమ్ము జమ కాలేదు. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో సోమవారం పరిహారం సొమ్ము జమచేస్తారు. ఈ బాధ్యతను ప్రభుత్వం స్థానిక కలెక్టర్లకు అప్పగించింది. 21,768 మంది బాధితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలమంది, అల్లూరి జిల్లాలో 4,620 మంది సహా ఇతర జిల్లాలలో ఉన్నారు. వారికి జిల్లా అధికారులు బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ చేస్తారు.
మరోవైపు విజయవాడ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నష్టం జరిగింది. ప్రాణనష్టంతో పాటుగా భారీ మొత్తంలో ఆస్తి, పంట నష్టం జరిగింది. ఇక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటూ వరదనీటిలో మునిగిపోయిన కుటుంబాలకు రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్న వారికి రూ.10 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే వరదల్లో చనిపోయిన కోళ్లు, పశువులుకు, వ్యాపారులకు సైతం పరిహారం ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే అర్హులైన వారి జాబితాను ప్రదర్శించి.. వారి అకౌంట్లలోకి డబ్బులు జమచేశారు. తాజాగా ఆధార్ అనుసంధానం సహా ఇతరత్రా సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వారికి రేపు జమ చేస్తారు.