గుంటూరువాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా రవాణా వ్యవస్థలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకంలో భాగంగా.. రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు వంద బస్సులు అవసరమని ప్రతిపాదించారు.. త్వరలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే.. కాలుష్యం కూడా తగ్గుతుంది అంటున్నారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సులకు నిర్వహణ వ్యయం కూడా తక్కువ.. అలాగే ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. అందుకే ఈ బస్సులు వచ్చి వెళ్లేందుకు వంద కిలోమీటర్ల దూరం ఉండేలా ఆయా రూట్‌లలో పల్లె వెలుగు కింద నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ బస్సుల్ని గుంటూరుకు సమీపంలోని పెదకాకాని బస్టాండు వెనుక ఆర్టీసీకి ఉన్న 3.5 ఎకరాల స్థలాన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇక్కడ ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారుల. భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఏపీలో ఆర్టీసీ ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పల్లెవెలుగు కింద మార్చి ఆయా రూట్‌లలో నడుపుతున్నారు. ఈ బస్సులకు కూడా నిర్వహణ వ్యయం పెరగడంతో పాటు కాలుష్యానికి కారణం అవుతోంది. అందుకే కొత్తగా వచ్చే వంద ఎలక్ట్రిక్ బస్సుల్లో.. అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా 20, మిగిలినవాటిని పల్లెవెలుగు కింద నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఛార్జీల భారం పెద్దగా ఉండదు అంటున్నారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు కూడా ఊరట దక్కుతుందంటున్నారు.
ఈ 100 బస్సుల్లో గుంటూరు నుంచి విజయవాడకు 20, గుంటూరు నుంచి తెనాలి (వయా నారాకోడూరు) 30, గుంటూరు నుంచి సత్తెనపల్లి 15, గుంటూరు నుంచి పొన్నూరు 15, గుంటూరు నుంచి చిలకలూరిపేటకు 10, గుంటూరు నుంచి అమరావతిలోని ఏపీ హైకోర్టుకు 5, గుంటూరు నుంచి అమరావతిలోని సచివాలయానికి 5, గుంటూరు నుంచి అమరావతికి 5 సర్వీసుల్ని నడపనున్నారు.