దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. సోమవారం హైకోర్టులో పిటిషన్ పై విచారణ చేయగా.. పిటిషనర్‌కి నోటీసులు జారీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ లాయర్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించగా.. పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారన్న ఆర్జీవీ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు.
వాస్తవానికి మద్దిపాడు పోలీసులు వర్మను విచారణకు పిలిచారు.. మంగళవారం రావాలన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరఫు లాయర్ ప్రస్తావించారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరగా.. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థనలు తమ ముందుకు తీసుకురావొద్దని సూచించింది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై వివాదం నడిచింది. వర్మ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వరుసగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. దీనిపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆర్జీవీపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. దీంతో వర్మపై వరుసగా కేసులు నమోదయ్యాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోస్టులకు సంబంధించి.. రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్ మద్దిపాడులో కేసు నమోదు చేశారు. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.. దీంతో ఈ కేసులో తనను అరెస్ట్ చేస్తారని భావించిన ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు.. అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.