ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. స్పీకర్‌ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. జగన్‌ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. దీంతో ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి దక్కదని అధికార పక్షం చెబుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో 10శాతం సీట్లు సాధించాలనే నిబంధన ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం ఉండదన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించొచ్చన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు.

ఆ తర్వాత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభ సంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ శాసనసభాపక్ష నేత ప్రమాణ స్వీకారం తర్వాత.. ప్రధాన ప్రతిపక్ష నేతతో ప్రమాణం చేయించాల్సి ఉంటుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. కానీ ఏపీ అసెంబ్లీలో అందుకు భిన్నంగా వ్యవహరించారని.. సభలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారన్నారు. ఈ పరిణామాలను బట్టి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్లు భావించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో మూడు పార్టీలు ( టీడీపీ, జనసేన, బీజేపీ) కలిసి పోటీ చేశాయని.. మిగిలిన వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షమే అన్నారు.

అసెంబ్లీ మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు సాధించలేనందున ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్న వ్యాఖ్యల్ని జగన్ గుర్తు చఏశారు. అయితే ఆంధ్రప్రదేశ్ పేమెంట్‌ ఆఫ్‌ శాలరీస్‌ అండ్‌ పెన్షన్స్, రిమూవల్‌ ఆఫ్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి ప్రస్తావించారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ చట్టంలోని సెక్షన్ 12బీని బట్టి తన పార్టీకి వచ్చిన సీట్లు, తన హోదా ఉన్నాయన్నారు. ఈ చట్టం కల్పించిన అధికారులను సాధించడం కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో 10శాతం సీట్లు లేని కారణంగా వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే హక్కు లేదని అధికారపక్షం వాదనకు చట్టబద్దమైన ఆధారం లేదన్నారు. ఈ పిటిషన్‌పైనే కోర్టు విచారణ జరుపుతోంది.

About amaravatinews

Check Also

డైరెక్టర్ ఆర్జీవీకి మరో తలనొప్పి.. ఈసారి రంగంలోకి సీఐడీ.. విచారణకు హాజరయ్యేనా…

2019లో రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో ఓ సినిమా తీశారు. ఆ మూవీపై తెలంగాణ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *