గుంటూరు మేయర్, వైఎస్సార్‌సీపీ నేత కావటి మనోహర్‌నాయుడిపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. గుంటూరుకు మేయర్, నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగేనా ఉండేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ వంటి పదవిలో ఉన్న వ్యక్తికి బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. ఒకవేళ రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పు లేదని.. అసభ్య పదజాలంతో వారి కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది. ఏ పార్టీ వారైనా సరే అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మేయర్ మాట్లాడిన భాష ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించింది.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్లు.. సేవ చేసి ప్రజలకు దగ్గరవ్వాలని.. అసభ్యకర భాషతో కాదంది హైకోర్టు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మేయర్ ఇలాంటి భాష ఉపయోగించడం దారుణమని వ్యాఖ్యానించింది. ప్రత్యర్థి పార్టీల నేతలపై ఇలాంటి భాషతో విమర్శలు చేయడం మంచిది కాదని.. దుర్భాషలాడి ఎన్నికల్లో గెలవాలనుకోవడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇకనైనా బాధ్యతగా ఉండాలని మేయర్ మనోహర్‌నాయుడికి చెప్పాలని ఆయన తరఫు లాయర్‌కు కోర్టు సూచించింది. ఆయనపై నమోదైన కేసులో మనోహర్‌నాయుడికి 41ఏ నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించిన కోర్టు.. అలాగే మేయర్ దర్యాప్తునకు సహకరించాలని సూచించింది. ఈ కేసులో ఫిర్యాదిదారు కనపర్తి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ కేసు, పిటిషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.