ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ గతవారమే మొదలైంది. వారం రోజులుగా కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.. అన్ని బ్రాండ్ల మద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ రూ.99 మద్యం కూడా షాపుల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. రూ.99కే క్వార్టర్ మద్యానికి క్రేజ్ పెరిగింది. మరికొన్ని కంపెనీలు కూడా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆసక్తి కనబరుస్తున్నాయట.
రాష్ట్రంలో తక్కువ ధరకు వస్తున్న లిక్కర్ బ్రాండ్ల అమ్మకాలు పెరుగుతాయని.. కంపెనీలు తమ బ్రాండ్లను కూడా తక్కువ ధరకు తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు. అలాగే మీడియం కేటగిరీ మద్యం ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీలు ఎక్సైజ్ శాఖతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు కంపెనీలు ఏడు రకాల బ్రాండ్లను రూ.99కే సరఫరా చేసేందుకు అనుమతులు వచ్చాయి. దాదాపు 30 వేల కేసులను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మద్యం ఆర్డర్లు కూడా పెరిగాయని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రూ.99కే క్వార్టర్ మద్యం అందించే కంపెనీలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో అమ్మకాల ట్రెండ్ ఆధారంగా తాము కూడా అదే ధరకు మద్యం సరఫరా చేస్తే ఎలా ఉంటుందని పలు కంపెనీలు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరికొంతకాలం వేచిచూసి వినియోగదారుల స్పందన చూసి ముందుకు రావాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయట. రాష్ట్రంలో తక్కువ ధర ఉన్న మద్యంపై వ్యాపారులకు తక్కువ మార్జిన్ వస్తుంది.. అదే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయిస్తే ఎక్కువ మార్జిన్ వస్తుంది కాబట్టి, తక్కువ ధర మద్యాన్ని ఎక్కువగా తీసుకోకపోవచ్చనే మరో వాదన కూడా ఉంది. మరోవైపు రూ.99కే క్వార్టర్ మద్యం బాటిల్స్ కొన్ని జిల్లాల్లో గత శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సోమవారం నుంచి ఇంకొన్ని షాపుల్లో రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తెచ్చారు.
ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.. ఇప్పటికే కొంత స్టాక్ అందుబాటులోకి తెచ్చారు. అయితే రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తే బావుంటుందని మందుబాబులు చెబుతున్నారు. కొత్త మద్యం షాపులు ప్రారంభమై వారం మాత్రమే కావడంతో.. రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన మద్యం, మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే మద్యం షాపులకు శాశ్వతంగా లైసెన్సులు ఇవ్వాల్సి ఉంది.. మరో నెల రోజుల్లో అంతా సర్దుబాటు అవుతుందంటున్నారు.