ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు. మంత్రి సొంత కారు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం మంజూరు అయ్యింది. ఆ మొత్తాన్ని మంత్రి సంధ్యారాణి వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మంత్రి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు ప్రభుత్వం నుంచి ఇలా లోన్ తీసుకుని.. జీతంలో నుంచి మినహాయించుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రాష్ట్రంతో వరద బాధితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబు చేసిన కృషికి మంత్రులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడి వరద బాధితుల్ని ఆదుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కూడా కరచాలనం చేసి అభినందించారు. మంత్రులు, అధికారుల సమష్టి కృషితోనే బాధితులకు సాయం చేయగలిగాం, అండగా నిలవగలిగామన్నారు చంద్రబాబు. అలాగే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రికి కేబినెట్ అభినందనలు తెలిపింది.