ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో కందిపప్పు కేజీ ధర రూ. 180 నుంచి రూ. 160కి, ఆ తర్వాత రూ. 150కి తగ్గించే విధంగా వర్తకులతో మాట్లాడామని చెప్పారు. రాష్ట్రంలో రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పు రూ. 67కే అందుబాటులోకి వచ్చిందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చొరవతో పామాయిల్ ధర రూ. 110కు తగ్గింది అన్నారు. అంతేకాదు 2,300 అవుట్ లెట్స్ ద్వారా పామాయిల్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఉల్లి, టమాటాలను మార్క్‌ఫెడ్ సహకారంతో తక్కువ ధరలకే అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అలాగే వచ్చే నెల నుంచి కందిపప్పు, చక్కెర కూడా బియ్యంతో పాటుగా అందించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు నాదెండ్ల మనోహర్. రీ డిజైన్ చేసి త్వరలోనే వాటిని ఇస్తామని చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తున్నామని గుర్తు చేశారు.. ఇప్పటివరకు 147 టన్నుల ధాన్యాన్ని కొని, 24 గంటల్లోనే సుమారు రూ. 34 లక్షలు చెల్లించామన్నారు. కాకినాడలో 52,000 టన్నుల్లో 27,000 టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించామని.. 11 మందిపై పోలీసు కేసులు నమోదయ్యాయని చెప్పారు. పీడీఎస్ బియ్యం రీసైకిలింగ్ ఓ మాఫియాలాగా తయారైందని ఆరోపించారు.