ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని ప్రకటించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్లు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రివర్గం, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ‘త్వరలోనే మీరు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నా. నేను మీతోనే ఉన్నా’ అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ కేబినెట్ భేటీలోనే నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు.
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం కొంతకాలంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులపై ఈ ప్రభావం కనిపించింది. ఈ క్రమంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నాయి. ఫీజులు కట్టకపోతే పరీక్షలు కూడా రాయనీయబోమని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండటంతో పరీక్ష ఫీజు రుసుమును ఆయా యాజమాన్యాలు కట్టించుకోవడం ఆపేశారు. తాము పరీక్ష ఫీజు కట్టించుకోవాలంటే ట్యూష్ ఫీజ్ కచ్చితంగా చెల్లించాలనే ఒత్తిడి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరోవైపు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై వైఎస్ షర్మిల స్పందించారు. ‘YSR మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. మహానేత హయాంలో, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఒక ప్రతిష్ఠాత్మక పథకం. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకం. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని YSR అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి గారు తన హయాంలో పథకాన్ని నీరు గార్చారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదు’ అన్నారు.