ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలయ్యలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు మొదలయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై టీడీపీ, జనసేన పార్టీ నేతల ఫిర్యాదులతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు.
వీటిలో నందిగామ డివిజన్‌లో 14, సైబర్ పీఎస్‌లో 9, సెంట్రల్ డివిజన్‌లో 6, పశ్చిమ డివిజన్‌లో 5, సౌత్ డివిజన్‌లో 3, నార్త్ డివిజన్‌లో 3, మైలవరం డివిజన్‌లో 2.. కలిపి మొత్తం 42 కేసులు ఉన్నాయి. వీటితో ఇప్పటి వరకు ఈ తరహా కేసులు మొత్తం 47 వరకు నమోదయ్యాయి. ఏకే ఫ్యాన్ ఎట్ జగన్‌మామ92, దర్శన్ ఎట్ దూరదర్శన్619, ఎఫ్ రెడ్డి వంటి ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్స్ పేర్లతో ఈ పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కొన్ని హ్యాండిల్స్ వివరాలు సేకరించి.. మరికొందరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని గుర్తించారు. వీరిపై ఐటీ చట్టంతో పాటు బీఎన్‌ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ హరీశ్వర్‌రెడ్డి గత ప్రభుత్వంలో అప్పటి తెలుగు దేశం పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారని మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెరుకూరు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం కేసులకు సంబంధించి 8మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీ అడ్రస్ ఆధారంగా వీరి వివరాలు సేకరించి.. దాని ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే సోషల్ మీడియా పోస్ట్‌లు, ట్వీట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.. సమస్యలు కొని తెచ్చుకోవద్దు అంుటన్నారు.