ఏపీకి కేంద్రం మరో అదిరిపోయే శుభవార్త.. 

ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. అమరావతి, పోలవరంతో పాటూ పలు కీలక ప్రకటనలు చేసింది. వీటితో పాటూగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాపై కూడా క్లారిటీ వచ్చిది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,474.64 కోట్ల వాటా రానుంది.. ఇది గతేడాది కంటే రూ.5,776 కోట్లు (12.92%) అధికం అని కేంద్రం తెలిపింది. గత ఫిబ్రవరిలో రూ.49,364.61 కోట్లతో పోలిస్తే.. రూ.1,110 కోట్లు ఎక్కువ.

కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.12,47,211.28 కోట్ల వాటాను పంచనుంది. ఇందులో 4.047% ఆంధ్రప్రదేశ్‌కు దక్కనుంది.. రాష్ట్రానికి రానున్న వాటాలో అత్యధికంగా ఆదాయపన్ను నుంచి రూ.17,455.93 కోట్లు వస్తుంది. ఆ తర్వాత కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద రూ.15,156.51 కోట్లు, సీజీఎస్‌టీ రూ.15,079.39 కోట్లు రానున్నాయి. అలాగే ఏపీకి సంబంధించి కస్టమ్స్‌ రూ.2,228.46 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ.469.73 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.1.66 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల కింద రూ.82.96 కోట్లు రానుంది.

మరోవైపు ఏపీకి సంబంధించి అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ తర్వాత మీడియాతో మాట్లాడిన నిర్మల.. ఆంధ్రప్రదేశ్‌కు అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2014లో ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతోందని.. ప్రాజెక్ట్ నిర్మాణ మొదలుపెట్టిన తర్వాత సహాయ, పునరావాసంపై కొత్తగా కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. కేంద్రం అంగీకరించిన షరతులకు ఎంత వరకు డబ్బులు ఇవ్వాలో అన్ని ఇస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయన్నారు నిర్మల. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏమేం చేయాలో అంతా చేస్తామని.. దానిపై పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. దీనికి సంబంధించి గ్రాంట్‌ ఇస్తున్నారా? రుణం తెస్తున్నారా? అని అడగడానికి ఆస్కారం లేదని.. కేబినెట్‌ ఆమోదించిన మొత్తాన్ని ఇప్పటి వరకూ పూర్తిగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా ఇస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం సాయం చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు కేంద్రమంత్రి. అందువల్ల దాని నిర్మాణం కోసం కేంద్రం కచ్చితంగా సాయం చేయాలి అన్నారు. అందుకే బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ప్రపంచబ్యాంకు సాయంతో తాము ఏపీకి తెప్పిస్తున్నామన్నారు. ఈ నిధులకు కౌంటర్‌పార్ట్‌ ఫండింగ్‌ (వాటా) కూడా ఉంటుందని.. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి.. అది వారు ఇస్తారా? ఇవ్వలేరా? తాము కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇచ్చుకుంటామా? అన్నది చూసి, వారితో మాట్లాడుకొని చేస్తామన్నారు. పదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా గడిచిపోయిందని.. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చట్టప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలని.. కానీ దానికి కారణం ఎవరన్నేది తాము లోతుల్లోకి వెళ్లడం లేదన్నారు. రాజధాని నిర్మించడం కోసం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్.

About amaravatinews

Check Also

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

110 మంది పోలీసులు, 11 బ్రృందాలు 24 గంటలు పని చేస్తే కేసును ఛేదించడానికి ఏడు రోజులు సమయం పట్టింది.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *